prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 8:24 pm Digital Edition : PRAJA VANI

శాతవాహన యూనివర్సిటీ విద్యార్థిని చంద్రకళ ఆత్మహత్యపై న్యాయ విచారణ జరిపించాలి

*శాతవాహన యూనివర్సిటీ విద్యార్థిని చంద్రకళ ఆత్మహత్యపై న్యాయ విచారణ జరిపించాలి*

*కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి*

*దోషులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలి – పాలడుగు నాగార్జున*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్న డాకూరి చంద్రకళ (23) ఆత్మహత్య ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. షాద్‌ నగర్‌కు చెందిన ఎస్సీ డక్కలి సామాజిక వర్గానికి చెందిన చంద్రకళ కూలి పనులు చేసుకునే నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కష్టపడి న్యాయ విద్యను అభ్యసిస్తున్నదని, చదువులో చురుకుగా ఉండటంతో పాటు ఎస్‌ఐ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నదని తెలిపారు. మహిళా సమస్యలపై చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తూ, సెలవు రోజుల్లో పేద పిల్లలకు చదువు, కరాటే నేర్పిస్తూ సామాజిక బాధ్యతలు నిర్వహించేదని పేర్కొన్నారు. గజ్జల హరికృష్ణ వేధింపులు, మోసం ఈ ఘటనకు కారణమై ఉండవచ్చనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థినులపై వేధింపులు పెరుగుతున్నా ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

*ప్రభుత్వం తక్షణమే స్పందించి కింది డిమాండ్లను అమలు చేయాలి*

చంద్రకళ ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితుడు గజ్జల హరికృష్ణపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. చంద్రకళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలి. శాతవాహన యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ బాధ్యతపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అన్ని విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు, షీ టీంలను సమర్థవంతంగా ఏర్పాటు చేసి విద్యార్థినులకు భద్రత కల్పించాలి. పౌర సమాజం, మేధావులు, ప్రజాసంఘాలు, పోలీసులు, యూనివర్సిటీ అధ్యాపకులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. విద్యార్థినుల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.