*వేదాంతపురంలో మూతపడిన పల్లె దవాఖాన.. వైద్యం కోసం ప్రజలు అవస్థలు**
ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 2
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖాన (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) నిర్వాహకుల నిర్లక్ష్యంతో మూతపడుతోందనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉచిత వైద్యం అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇక్కడి సిబ్బంది తీరు తూట్లు పొడుస్తోంది. ఎప్పుడు వచ్చి చూసినా ఈ ఆసుపత్రికి తాళం వేసి ఉండటంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నపాటి జ్వరం, దగ్గు, లేదా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినా స్థానికంగా వైద్యం అందక అవస్థలు పడాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు లేక నానా తంటాలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి, వేదాంతపురం పల్లె దవాఖాన క్రమం తప్పకుండా తెరిచేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.