prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 9:05 am Digital Edition : PRAJA VANI

కోసిగిలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

కోసిగిలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

కర్నూలు, నవంబర్ 12 (ప్రజావాణి):

కోసిగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, దేశానికి మరియు విద్యారంగానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.

1888 నవంబర్ 11న సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో జన్మించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిన్ననాటి నుంచే విద్య, సాహిత్యం, దేశభక్తిపై ఆసక్తి కనబరిచారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన 1920లో మహాత్మా గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. 1940 నుంచి 1946 వరకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

స్వాతంత్ర్యం అనంతరం 1947 నుంచి 1958 వరకు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. ఆయన హయాంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఐఐటీలు, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ వంటి విద్యా, సాంస్కృతిక సంస్థల అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన రచించిన ‘ఇండియా విన్స్ ఫ్రీడం’ గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొందింది. దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 1992లో భారత ప్రభుత్వం ఆయనకు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని, ఆయన ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.