*లక్ష మంది విద్యార్థులకు 643 కళాశాలల్లో*
*ఉచిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ*
నాగర్ కర్నూల్ జిల్లా…
కల్వకుర్తి నియోజకవర్గo : ప్రజావాణి
ప్రతినిధి నవంబర్ 03:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులకు కృత్రిమ మేధస్సు, మేఘ గణనతో పాటు ఆధునిక సాంకేతిక రంగాల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ నైపుణ్య, పరిజ్ఞాన సంస్థ (టాస్క్), అమెజాన్ వెబ్ సేవల సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టాస్క్ ముఖ్య నిర్వహణ అధికారి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 643 కళాశాలల్లో విద్యార్థులకు కృత్రిమ మేధస్సు, మేఘ గణన, యంత్ర అభ్యసనం వంటి ఆధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. కళాశాల విద్యార్థులతో పాటు అన్ని విభాగాల విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.శిక్షణలో భాగంగా ఏడాది పాటు 900కు పైగా ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉంటాయని, శిక్షణ పూర్తిచేసిన అర్హులైన విద్యార్థులకు ప్రత్యేక ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, టాస్క్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నితిన్ రెడ్డి, ఐటీ శాఖ అధికారులు, అమెజాన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.