రైతుల రుణాల రీషెడ్యూలింగ్ ప్రక్రియను బ్యాంకులు వెంటనే చేపట్టాలి… !
అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
కరువు పరిస్థితుల నేపథ్యంలో అర్హులైన రైతుల రుణాలను రీషెడ్యూలింగ్ చేసేందుకు బ్యాంకులు తక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్లో బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులతో కరువు పరిస్థితులు, రైతుల రుణాల పునర్వ్యవస్థీకరణపై అదనపు కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉన్నందున జలాశయాలు, చెరువుల్లో అందుబాటులో ఉన్న నీటిని త్రాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండో పంట సాగుకు ఏమాత్రం అవకాశం లేదని స్పష్టం చేశారు.
బోరు బావుల ద్వారా నీటిని వినియోగించి రెండో పంట సాగు చేసినప్పటికీ పంటలు పూర్తి స్థాయిలో ఎదిగి దిగుబడులు వచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చని తెలిపారు.
కరువు పరిస్థితులను నిర్ధారించేందుకు నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించగా, ఖమ్మం జిల్లాలోని 17 మండలాలు ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు.
జిల్లాలో 7 మండలాలు మోస్తరు కరువు ప్రభావిత ప్రాంతాలుగా, 10 మండలాలు తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు వివరించారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు ఆర్థికంగా ఉపశమనం కల్పించేందుకు వ్యవసాయ స్వల్పకాలిక రుణాలు, పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన టర్మ్ రుణాలు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ, వ్యవసాయంపై ఆధారపడిన ఇతర కార్యకలాపాలకు సంబంధించిన అర్హమైన రుణాల చెల్లింపును పునర్వ్యవస్థీ కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తీవ్ర కరువు ప్రభావిత 10 మండలాల్లో అర్హులైన రైతుల రుణాల చెల్లింపు వ్యవధిని 60 నెలల వరకు పొడిగించడంతో పాటు 12 నెలల మారటోరియం కల్పించాలని తెలిపారు. మోస్తరు కరువు ప్రభావిత 7 మండలాల్లో అర్హులైన రైతుల రుణాల చెల్లింపు వ్యవధిని 36 నెలల వరకు పొడిగించి, 12 నెలల మారటోరియం కల్పించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు.
రుణాల రీషెడ్యూలింగ్ అనేది రుణమాఫీ కాదని, రైతులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు అదనపు సమయం కల్పించే ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ విషయంపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు.
రుణాల పునర్వ్యవస్థీకరణ అనంతరం అవసరం, సాధ్యాసాధ్యాలు పరిశీలించి అర్హత కలిగిన రైతులకు అదనపు రుణాలు మంజూరు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. రుణ గ్రహీతలు స్వయంగా బ్యాంకులను సంప్రదించే వరకు వేచి చూడకుండా బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి బ్యాంకు పరిధిలోని అర్హులైన రైతులను గుర్తించి, వారితో సంప్రదింపులు జరిపి రుణాల రీషెడ్యూలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని తెలిపారు. ఏ ఒక్క అర్హుడైన రైతు కూడా ఈ ప్రయోజనం పొందకుండా మిగిలిపోకూడదని స్పష్టం చేశారు.
రైతుల వివరాలు, రుణాల అర్హత, రీషెడ్యూలింగ్కు సంబంధించిన సమాచారాన్ని నిర్దేశిత నమూనాలో సేకరించి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కరువు పరిస్థితుల్లో రైతులకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో ఎల్డిఎం రవిప్రసాద్, డిసిఓ గంగాధర్, వ్యవసాయ, బ్యాంక్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.