రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ప్రణయ్, మనసకు ఘన సన్మానం
క్రీడల్లో రాణించాలి.. గ్రామానికి పేరు తీసుకురావాలి – విజేతలకు తలా రూ.10 వేల ప్రోత్సాహక బహుమతి ప్రకటన
మన ప్రజావాణి | నవంబర్ 05 నేరడిగుంట | జిల్లా ప్రతినిధి
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులు ప్రణయ్, మనసలను గ్రామస్థుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రణయ్, మనసలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గ్రామానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అభిలషించారు.
అలాగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిస్తే ఇద్దరు క్రీడాకారులకు తలా రూ.10 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేస్తానని ప్రకటించారు. గ్రామంలోని ప్రతిభావంతులైన విద్యార్థులు, యువతను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈశ్వర్, వార్డు సభ్యులు బోయిని శంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.