prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 7:24 pm Digital Edition : PRAJA VANI

రహదారులపై ధాన్యం ఆరబెట్టవద్దు.. ప్రమాదాలకు తావివ్వొద్దు

రహదారులపై ధాన్యం ఆరబెట్టవద్దు.. ప్రమాదాలకు తావివ్వొద్దు

రైతులు సురక్షిత ప్రదేశాలను వినియోగించుకోవాలి – జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్

ప్రజావాణి న్యూస్ మెదక్ జిల్లా బాలరాజు

రహదారులపై వరి ధాన్యం ఆరబెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ధాన్యం చుట్టూ రాళ్లు పెట్టడం, నల్లటి పాలిథిన్ కవర్లతో కప్పడం వల్ల ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులు వాటిని గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.

రహదారులపై ధాన్యం ఆరబెట్టడం ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని స్పష్టం చేశారు. రైతులు రహదారులను వినియోగించకుండా గ్రామ పంచాయతీ ప్రాంగణాలు, ఖాళీ స్థలాలు లేదా రహదారులకు దూరంగా ఉన్న సురక్షిత ప్రదేశాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు.

చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, రైతులు తమ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రమాదాల నివారణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.