యాసంగిలో వరి విస్తీర్ణం తగ్గించాలి.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి: సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. వెంకట్రామ్ రెడ్డి
మేడ్చల్: రాబోయే యాసంగి–2026 సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ అనిశ్చితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందుగానే పంటల సాగు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని మేడ్చల్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. వెంకట్రామ్ రెడ్డి సూచించారు.
యాసంగి సీజన్‌లో నీటి లభ్యత పరిమితంగా ఉండే అవకాశాల నేపథ్యంలో రైతులు వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలని ఆయన కోరారు. ముఖ్యంగా బోరు బావులు, ఇతర పరిమిత నీటి వనరులపై ఆధారపడే రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. వరి పంటకు అధికంగా నీరు అవసరమవుతుందని పేర్కొంటూ, రైతులు పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, ఆముదం వంటి తక్కువ నీటితో సాగు చేయగల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మేడ్చల్ జిల్లా హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్నందున రైతులు వరికి బదులుగా కూరగాయల పంటలను సాగు చేయడం ద్వారా మంచి అవకాశాలను వినియోగించుకోవచ్చని సూచించారు.
రైతులు యాసంగి సీజన్‌లో నీటి లభ్యతకు అనుగుణంగా వరి సాగు విస్తీర్ణాన్ని పరిమితం చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలిపారు. భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు స్వల్పకాలిక, తక్కువ నీటి అవసరమయ్యే పంట రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకే పంటల ప్రణాళికను రూపొందించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చని సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. యాసంగి–2026 సీజన్‌లో రైతులందరూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించి, నీటి పొదుపులో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.