prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 6:23 pm Digital Edition : PRAJA VANI

మౌలానా ఆజాద్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

*మౌలానా ఆజాద్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం*

*విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి: సర్పంచ్ కోనేరు భూమన్న*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, సారంగాపూర్ నవంబర్ 7:-
దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలను శనివారం సారంగాపూర్ గ్రామంలోని అంబేద్కర్ చౌక్‌లో కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోనేరు భూమన్న ముఖ్య అతిథిగా పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ కోనేరు భూమన్న మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ స్వాతంత్ర్య పోరాటంలోనే కాకుండా స్వతంత్ర భారతదేశ విద్యారంగ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థ పటిష్టతకు, ఉన్నత విద్య, సాంకేతిక విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని విశ్వసించిన మహనీయుడు ఆజాద్ అని అన్నారు. మతం, కులం, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందాలన్నది ఆయన ఆశయమని, ఆ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి సమాజానికి, దేశానికి సేవలందించాలని పిలుపునిచ్చారు. మహనీయుల జయంతి వేడుకలు కేవలం నివాళులకే పరిమితం కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన నివాళి అవుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.