మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను కొనసాగించాలి..
-స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆజాద్‌ది కీలక పాత్ర
-దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్ల పాటు విశేష సేవలు
-విద్యాభివృద్ధి, జాతీయ సమైక్యతకు ఆజాద్ చేసిన కృషి ఆదర్శనీయం
-బీఆర్ఎస్ మైనారిటీ, జనగామ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు
-జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11(ప్రజావాణి):
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం, జనగామ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
విద్యాభివృద్ధికి, జాతీయ సమైక్యతకు ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆజాద్ కీలక పాత్ర పోషించారని, విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో దేశ విద్యారంగానికి పునాదులు వేశారని గుర్తుచేశారు.
ముస్లిం యువతను స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఏకతాటిపైకి తీసుకువచ్చి, తన రచనలు, పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారని తెలిపారు. బ్రిటిష్ పాలకుల ఆంక్షలను ఎదుర్కొంటూనే తన భావజాలాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని పేర్కొన్నారు.
హిందూ, ముస్లింల మధ్య ఐక్యతకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, మతాల మధ్య విభేదాలు తలెత్తకుండా దేశ సమైక్యత కోసం కృషి చేశారని కొనియాడారు.
స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలోనే ఉండి దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా సుమారు 11 సంవత్సరాల పాటు సేవలందించారని, విద్యారంగ అభివృద్ధికి పునాది వేసి విప్లవాత్మక మార్పులకు కృషి చేశారని తెలిపారు.
మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో కీలక బాధ్యతలు నిర్వహించారని, దేశ విభజనను వ్యతిరేకించి జాతీయ సమైక్యతకు కట్టుబడి నిలిచారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు, జనగామ పట్టణ శాఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.