మోడల్ స్కూల్ టీచర్స్ నిరసన..తహసిల్దార్ కు వినతి
ప్రజావాణి,నెల్లికుదురు:పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లికుదురు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సోమవారం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర మోడల్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రెండో దశ నిరసనలో భాగంగా మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, ఇంటర్మీడియట్ వరకు బోధిస్తున్న పీజీటీలకు జూనియర్ లెక్చరర్ (జేఎల్) వేతన స్కేలు వర్తింపజేయాలని, జీవో నం. 317ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని, దీర్ఘకాలంగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని కోరారు.
హెచ్‌బీటీలకు నెలకు రూ.35,000 వేతనం ప్రకటించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి మోడల్ స్కూళ్లను వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నవంబర్ 4, 5 తేదీల్లో జిల్లా స్థాయిలో అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. నవంబర్ 17న రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహించేందుకు రాష్ట్ర మోడల్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీచర్స్ ఎం.ఏ. అంజుమ్ సుల్తానా బి.సక్రం, టి. సతీష్, టి. రాంనర్సయ్య, వై. నాగమోహన్ రావు, పి. యుగంధర్, సీహెచ్. జ్యోతి, బి. కవిత, ఎ. సునీత, బి.దేవేందర్,ఎన్.చంద్రు నాయక్ పాల్గొన్నారు.