ఘట్కేసర్, నవంబర్ 1 (ప్రజావాణి): మిస్సింగ్ ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన ఘట్కేసర్ పోలీసులు కేవలం మూడు గంటల్లోనే తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలుర ఆచూకీ గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు, సమన్వయంతో చేపట్టిన గాలింపు చర్యలు, వేగవంతమైన పోలీసు స్పందనతో బాలురను సురక్షితంగా గుర్తించడం విశేషం.
కొండాపూర్ గ్రామానికి చెందిన ఓర్సు వసంత, ములుగురం లలితలు తమ కుమారులు ఓర్సు శివప్రసాద్ (12), ములుగురం యశ్వంత్ (13) కనిపించడం లేదని అక్టోబర్ 31వ తేదీ రాత్రి 8.40 గంటలకు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు.
ఫిర్యాదుపై తక్షణ స్పందన.. ప్రత్యేక బృందాలతో గాలింపు
ఫిర్యాదు అందిన వెంటనే ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్ అప్రమత్తమై ఎస్‌ఐలు ఎ. శేఖర్, ఎ. రాఘవేంద్ర పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. బాలుర ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కానిస్టేబుళ్లు సత్యనారాయణ, రాజు సమన్వయంతో చేపట్టిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా కేవలం మూడు గంటల్లోనే వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు బాలురను గుర్తించారు.
క్షేమంగా అప్పగింత.. పోలీసుల కౌన్సెలింగ్
పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారని, దీంతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయామని బాలురు విచారణలో తెలిపారు. అనంతరం పోలీసులు వారిని క్షేమంగా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించిన తరువాత తల్లిదండ్రులకు అప్పగించారు.
మైనర్ బాలుర అదృశ్యంపై తక్షణమే స్పందించి, ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి మూడు గంటల్లోనే ఆచూకీ గుర్తించడం ద్వారా ఘట్కేసర్ పోలీసులు తమ విధి నిర్వహణలో అప్రమత్తత, సమన్వయాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని, వారి సమస్యలను ఓపికగా విని ప్రేమతో మార్గనిర్దేశం చేయాలని పోలీసులు సూచించారు. పిల్లలు కనిపించకుండా పోయిన సందర్భంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.