prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 9:37 pm Digital Edition : PRAJA VANI

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు:

   
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు:

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

ప్రశాంతమైన కౌంటింగ్ నిర్వహణే లక్ష్యం

ప్రజావాణి దినపత్రికి ప్రకాశం జిల్లా బ్యూరో నవంబర్ 2

నవంబర్ 3వ తేదీన ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ (కౌంటింగ్) ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు కౌంటింగ్ బందోబస్తు విధుల్లో పాల్గొననున్న పోలీస్ అధికారులకు మరియు సిబ్బంది సోమవారం రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా ఎస్పీ బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ బందోబస్తులో పాటించాల్సిన విధివిధానాలు, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అధికారిక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలతో పాటు అత్యవసర మార్గాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు నిషేధిత వస్తువులను లోపలికి అనుమతించరాదు.

కౌంటింగ్ కేంద్రాల లోపల కట్టుదిట్టమైన ప్రవేశ నియంత్రణ (Access Control) అమలు చేయాలి. ఎన్నికల అధికారులచే అనుమతించబడిన వ్యక్తులను మాత్రమే పూర్తి స్థాయి గుర్తింపు ధృవీకరణ మరియు ఫ్రిస్కింగ్ అనంతరం లోపలికి అనుమతించాలి.

కౌంటింగ్ ఏజెంట్లు ఇష్టానుసారంగా బయటకు వెళ్లి తిరిగి లోపలికి వచ్చే పరిస్థితిని అనుమతించకూడదు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రవేశం, తిరిగి ప్రవేశం (Re-entry) నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి.

పోలీస్ సిబ్బంది తమకు కేటాయించిన పాయింట్లలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు, ఘర్షణలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి అదుపులోకి తీసుకోవాలని సూచించారు.

కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల వాహనాలను ప్రత్యేకంగా నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై, కౌంటింగ్ కేంద్రాల పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బెల్ హ్యాండ్స్ ద్వారా అక్కడికి వచ్చే వాహనదారులకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు అందిస్తూ, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం, ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు నిర్వహణలో భాగంగా, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కి ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, అద్దంకి మున్సిపాలిటీకి దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, చీమకుర్తి మున్సిపాలిటీకి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి. శ్రీధర్‌లను ఇన్‌చార్జి అధికారులుగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., నియమించారు.

అనంతరం ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ , భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలీసుల గార్డ్ చెకింగ్ చేసి, సంబంధిత రికార్డులో సంతకం చేశారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా పూర్తి చేసేందుకు బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, కందుకూరు డిఎస్పి బాలసుబ్రమణ్యం, దర్శి డిఎస్పి బాల మురళీకృష్ణ, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి పి.శ్రీధర్, ఏఆర్ డిఎస్పి కె.శ్రీనివాసరావు, సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.