prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 8:24 am Digital Edition : PRAJA VANI

మాన్సాన్‌పల్లిలో పగటిపూట ఇంటి దొంగతనం కేసును ఛేదించిన జోగిపేట పోలీసులు

*మాన్సాన్‌పల్లిలో పగటిపూట ఇంటి దొంగతనం కేసును ఛేదించిన జోగిపేట పోలీసులు*

• మేనల్లుడే దొంగతనానికి పాల్పడినట్లు గుర్తింపు.. నిందితుడి అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం

జోగిపేట (మన ప్రజావాణి ) నవంబర్ 03: జిల్లా ప్రతినిధి

అందోల్ మండలం మాన్సాన్‌పల్లి గ్రామంలో అక్టోబర్ 30న పగటిపూట జరిగిన ఇంటి దొంగతనం కేసును జోగిపేట పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాన్సాన్‌పల్లికి చెందిన పిట్ల శ్రీశైలం కుటుంబ సభ్యులతో కలిసి నిశ్చితార్థ వేడుకకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ఆయన మేనల్లుడు సారా చంద్రశేఖర్ (19) ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించి, ఇంటి తాళాలతో పాటు బీరువా తాళాలను పగలగొట్టి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జోగిపేట పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు. నవంబర్ 2న సదాశివనగర్ గ్రామంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు:
2 తులాల బంగారు బిస్కెట్.
అర తులం బంగారు ఉంగరం.
30 తులాల వెండి పట్టీలు (ఒక జత).
1 తులం బంగారు కమ్మలు.
దొంగతనానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం.