prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 9:53 am Digital Edition : PRAJA VANI

ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర

ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర
కూకట్‌పల్లి నుంచి భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు – పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు
కూకట్‌పల్లి నవంబర్ 2 (ప్రజావాణి)
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఎస్.ఐ.ఆర్. ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన మహా పాదయాత్ర విజయవంతంగా ముగిసింది.
ఈ మహా పాదయాత్రకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై, నిజాం కాలేజ్ సమీపంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మొజంజాహి మార్కెట్ ఎక్స్ రోడ్ వరకు పాదయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు భారీగా తరలివచ్చి మహా పాదయాత్రలో పాల్గొన్నారు.
పాదయాత్రలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఆవశ్యకత, ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ విధులు, ఎస్.ఐ.ఆర్. ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజల్లో నమ్మకం ఉండాలని, ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదని పేర్కొన్నారు. ఎస్.ఐ.ఆర్. ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తరఫున ఖండిస్తూ తమ అభిప్రాయాలను ప్రజలకు వివరించారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం
ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే కాకుండా, తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సభలో పాల్గొన్న బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
“ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం” అనే నినాదంతో సాగిన ఈ మహా పాదయాత్రలో కూకట్‌పల్లి నియోజకవర్గ బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నాయని వడ్డేపల్లి రాజేశ్వరరావు తెలిపారు.
పాదయాత్ర విజయవంతానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి, కూకట్‌పల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు, పాల్గొన్న ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.