prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 8:56 pm Digital Edition : PRAJA VANI

పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్య స్థాపనకు కృషి చేద్దాం

పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్య స్థాపనకు కృషి చేద్దాం…

– కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ రమణ

మరుగున పడ్డ పాపన్న చరిత్రను వెలుగులోకి తెద్దాం –

-బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి

తాటి చెట్టుపై నుంచి పడ్డ గీత కార్మికులకు ఉచిత వైద్యం…

-డాక్టర్ శివ విజయ్ కుమార్ గౌడ్ హామీ

బహుజన విప్లవ వీరుడు పాపన్న ఆశయాలను కొనసాగిద్దాం..

-కేజీకేఎస్ నాయకుల పిలుపు

దేవరుప్పుల మండలం రాంబోజిగూడెంలో
డప్పు చప్పుళ్లు, కోలాటాల మధ్య ఘనంగా పాపన్న విగ్రహావిష్కరణ…

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 01 (ప్రజావాణి): బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్య స్థాపన కోసం కృషి చేయాలని, అదే పాపన్న ఆశయాల కొనసాగింపని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి రమణ అన్నారు.

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం, రాంబోజిగూడెం గ్రామంలో కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభ ఘనంగా జరిగింది. గ్రామంలో మహిళలు, యువకులు, గీత కార్మికులు డప్పు చప్పుళ్లు, కోలాటాలతో ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం పాపన్న విగ్రహాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి రమణ, బీసీ కమిషన్ మెంబర్ రంగు బాలలక్ష్మి, సుప్రజ హాస్పిటల్ ఎండీ డాక్టర్ శివ విజయ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు.

దేవరుప్పుల మండల అధ్యక్షులు భాస్కర్, గుర్రం రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎం.వి రమణమాట్లాడుతూ
“సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ముందుకు తీసుకుపోవడం కోసం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం గత 15 సంవత్సరాలుగా అనేక రూపాలలో కార్యక్రమాలు, పోరాటాలు చేసింది. ఈ పోరాటాల ఫలితమే గత ప్రభుత్వాలు పాపన్న జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేజీకేఎస్ నిర్వహించిన బస్సు యాత్ర ఫలితంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరించింది. అలాగే పెండింగ్ లో ఉన్న గీత కార్మికుల ఎక్స్ గ్రేషియా 20 కోట్ల రూపాయలను విడుదల చేసింది” అని తెలిపారు.

“కల్లుగీత వృత్తి ఆధునీకరణ, వృత్తిలో ఉపాధి పెంపొందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దానికి గీత కార్మికులు, గౌడులు రాజకీయాలకు అతీతంగా కల్లుగీత కార్మిక సంఘ ఉద్యమంలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.

బీసీ కమిషన్ సభ్యురాలు రంగు బాలలక్ష్మి మాట్లాడుతూ పాపన్న విగ్రహావిష్కరణ చేసుకోవడం అంటే మరుగున పడ్డ చరిత్రను, పాపన్న వీరత్వాన్ని, పరిపాలన దక్షతను గుర్తు చేసుకోవడమే అన్నారు. పాపన్న స్ఫూర్తితో మనమందరం ఐక్యంగా ఉండి అన్ని వర్గాలను కలుపుకొని గ్రామాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వపరంగా పరిష్కారం అయ్యే విధంగా తన వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వారధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
సుప్రజ హాస్పిటల్ ఎండీ డా. శివ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో పాపన్న చరిత్రను బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలంతో ఉన్న చరిత్రకారులు మరుగున పెట్టారని, చరిత్రను అణచివేసే కుట్రలు చేశారని అన్నారు. కానీ శ్రామిక ప్రజలు, శ్రమజీవులు, పల్లె సుద్దులు, పగటివేషాలు, ఒగ్గు కళాకారులు, బుర్రకథల్లో పాపన్న చరిత్ర కీర్తించబడిందని గుర్తు చేశారు. నేటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందిన తరుణంలో పాపన్న చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్లి భవిష్యత్ తరాలకు విస్తృతంగా అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వివరించారు. అలాగే తాను కేజీకేఎస్ మహాసభలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం తాటి చెట్టు మీది నుండి పడి గాయాలపాలై వైద్యం అందక ఇబ్బంది పడే గీత కార్మికులకు ఎంతటి ఖర్చైనా భరించి ఉచిత వైద్యం అందిస్తున్నానని, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కేజీకేఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బూడిద గోపి, వెంకట మల్లయ్య, హైకోర్టు న్యాయవాది రాంపల్లి శ్రీనివాస్, ఆర్టీఏ మెంబర్ చిలువేరు ఆబి గౌడ్, దేవరుప్పుల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, రాంబోజీగూడెం గ్రామ సర్పంచ్ ఫరీదుల ధనలక్ష్మి భాస్కర్, కేజీకేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు కుర్ర ఉప్పలయ్య, కమ్మగాని నాగన్న, మాచర్ల రఘురాములు, బండపల్లి శంకరయ్య, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్, మండల కార్యదర్శి ఉడుగుల ప్రభాకర్, జిల్లా కమిటీ సభ్యులు బసవగాని మహేందర్, బాల్నే ఉమాపతి, ఘనగాని రమేష్, యాదన్న, పరంధాములు తదితరులు పాల్గొన్నారు.