prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 8:32 pm Digital Edition : PRAJA VANI

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలి..

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలి..

అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03(ప్రజావాణి):
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియకు ఈ నెల 6వ తేదీ చివరి గడువు కావడంతో అర్హులైన పట్టభద్రులందరూ సకాలంలో తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు.

తొర్రూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించి, ఓటరు నమోదుకు వస్తున్న పట్టభద్రులకు అందిస్తున్న సేవలు, ఇప్పటివరకు జరిగిన నమోదు వివరాలను పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేవలం పార్టీ కార్యక్రమంగా కాకుండా పట్టభద్రులందరికీ ఓటు హక్కు కల్పించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు.

ఓటరు నమోదు గడువు నవంబర్ 6వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సమయం చాలా తక్కువగా ఉందని, కాబట్టి ప్రజాప్రతినిధులు, పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, NSUI నాయకులు ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో యుద్ధప్రాతిపదికన భాగస్వాములు కావాలని కోరారు.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారికి ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించి, దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఓటరుగా నమోదు చేసుకోని పట్టభద్రులను ప్రత్యేకంగా గుర్తించి, చివరి గడువులోగా వారి దరఖాస్తులు పూర్తయ్యేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఎవరూ ఓటు హక్కును కోల్పోకుండా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 6వ తేదీ చివరి గడువు కావడంతో ప్రతి ఒక్కరూ యుద్ధప్రాతిపదికన ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసేలా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.