prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 1:26 pm Digital Edition : PRAJA VANI

పట్టభద్రులారా.. నిర్లక్ష్యం వద్దు.. మీ విలువైన ఓటును నమోదు చేసుకోండి..

పట్టభద్రులారా.. నిర్లక్ష్యం వద్దు.. మీ విలువైన ఓటును నమోదు చేసుకోండి..

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు…

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03 (ప్రజావాణి): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తమ పేరును నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం ఒక ప్రకటన లో పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనదని, ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటు కీలక పాత్ర పోషిస్తుందని, విద్యావంతుల గొంతుకను శాసనమండలిలో వినిపించడానికి ఇదే సరైన అవకాశమని తెలిపారు.

రోజువారీ పనులు, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కొంత సమయాన్ని కేటాయించి తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. పని ఒత్తిడి కారణంగా ఓటు నమోదును వాయిదా వేయడం వల్ల మీ అమూల్యమైన హక్కును కోల్పోతారని హెచ్చరించారు.

ఓటు హక్కు అనేది ప్రతి పట్టభద్రుడికి ఉన్న ప్రజాస్వామ్య హక్కు. ఆ హక్కును వినియోగించుకోవడానికి ముందుగా ఓటరుగా నమోదు కావడం తప్పనిసరి. నమోదు చేసుకోకపోతే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉండదని ఆయన గుర్తు చేశారు.

చివరి తేదీ నవంబర్ 6 వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా అవసరమైన ధ్రువపత్రాలతో నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఫోటో వంటి పత్రాలతో ఆన్ లైన్ ద్వారా లేదా సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, తోటి పట్టభద్రులకు కూడా ఓటు నమోదు ప్రాధాన్యతను వివరించి వారిని ప్రోత్సహించాలని, అర్హత ఉన్న ఒక్క పట్టభద్రుడు కూడా ఓటు నమోదు చేసుకోకుండా మిగిలిపోకూడదని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, తమ చుట్టూ ఉన్న పట్టభద్రులను చైతన్యం చేయాలన్నారు.
మరింత మంది పట్టభద్రులకు అవకాశం కల్పించేలా ఓటరు నమోదు గడువును పొడిగించాలని సంబంధిత అధికారులను, ఎన్నికల సంఘాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. చాలా మంది పట్టభద్రులు ఇంకా నమోదు చేసుకోలేదని, వారికి మరికొంత సమయం ఇస్తే ప్రజాస్వామ్య ప్రక్రియలో మరింత మంది భాగస్వాములు అవుతారని అన్నారు.

చివరగా పట్టభద్రులారా.. నిర్లక్ష్యం వద్దు.. మీ విలువైన ఓటు హక్కును కోల్పోవద్దు. కొంత సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి పిలుపునిచ్చారు.