నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలి..
ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరికరాలు, మౌలిక వసతులు ఉండాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03 (ప్రజావాణి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్), ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కింద వైద్య ఆరోగ్య, కుటుంబ రక్షణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) ద్వితీయ త్రైమాసిక సమితి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగే విధంగా వైద్యాధికారులు సేవలు అందించాలని సూచించారు. ముఖ్యంగా నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రుల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, రోగుల వార్డుల నిర్వహణ, మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుపేద రోగులకు మెరుగైన డయాలసిస్ సేవలు అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా డయాలసిస్ సేవలను మరింత విస్తరించాలని సూచించారు.
మాతా శిశు ఆసుపత్రిలో గదుల లభ్యత, ఇతర సేవలకు సంబంధించిన వివరాలను ప్రజలు సులభంగా తెలుసుకునేలా ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించి, అవసరమైన వారు ముందుగానే ఆన్‌లైన్ ద్వారా గదులు బుక్ చేసుకునే విధానాన్ని 15 రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఆసుపత్రుల్లో రోడ్ల నిర్మాణ పనుల్లో భాగంగా ఫ్లోరింగ్ ఏర్పాటు నాణ్యతతో చేపట్టాలన్నారు. ఆసుపత్రుల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అవసరమైన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, డీఎంహెచ్ఓ వాణిశ్రీ, డీసీహెచ్ఎస్ సంధ్య, వైద్యారోగ్య శాఖ అధికారులు, హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.