దోర్నాల శ్రీహరి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 02(ప్రజావాణి): జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త దోర్నాల శ్రీహరి రెండో కుమారుడు దోర్నాల శ్రవణ్ (48) మూడు రోజుల క్రితం అమెరికాలో గుండెపోటుతో అకాల మృతి చెందారు. అమెరికాలో ఉంటున్న శ్రవణ్ ఇలా హఠాత్తుగా మృతి చెందడం పట్ల జనగామ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ విషాదకర వార్త తెలుసుకున్న వెంటనే జనగామ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టణంలోని దోర్నాల శ్రీహరి నివాసానికి సోమవారం వెళ్లి
కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చారు. తండ్రి దోర్నాల శ్రీహరి ని పట్టుకుని ధైర్యం చెప్పారు. శ్రవణ్ మృతి చాలా బాధాకరమని, చిన్న వయసులోనే ఇలా జరగడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భగవంతుడు వారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మృతుని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ పరామర్శలో ఎమ్మెల్యే వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.