తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ…!
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
వేసవి కాలం, ఎల్నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, డబ్ల్యూఎస్ఎమ్ ఛైర్మన్ దివాకర టి ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై, అడిగిన వారికి పని కల్పన పై కలెక్టర్, జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 21 మండలాల్లో నవంబర్ 09 నుండి నవంబర్ 14 వరకు మండల స్థాయి సమావేశాలను నిర్వహించాలన్నారు. ఇట్టి సమావేశాలలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు మరియు సాంకేతిక సిబ్బంది వంద శాతం భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ (ఇంట్రా & గ్రిడ్) ఎఈఈ/ఎఈ, ఎంపీఓ, సర్పంచ్లు, కార్యదర్శులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రతి వీధిలో 24-పాయింట్ల చెక్లిస్ట్ ఆధారంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు ముందే హ్యాండ్ పంపులు, సింగిల్/త్రీ-ఫేజ్ మోటార్ల మరమ్మతులు, పైప్లైన్ లీకేజీల నివారణ, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల శుభ్రత, క్రిమిసంహారక చర్యలు పూర్తి చేయాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో 3 నెలలకు సరిపడా బ్లీచింగ్ పౌడర్ బఫర్ స్టాక్ నిల్వ ఉంచాలని తెలిపారు.
తక్కువ వర్షపాతం, నీటిమట్టం పడిపోవడం లేదా స్థానిక బోరుబావులు ఎండిపోయిన ప్రాంతాలను గుర్తించి, నీటి ఎద్దడి రాకుండా గ్రామ పంచాయతీ నీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైన చోట నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యవసాయ బావులను అద్దెకు తీసుకోవడానికి ముందస్తు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నీటి శుద్ధి కేంద్రాలు, ఇంటేక్ బావులు, పంపింగ్ స్టేషన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, కనీస నీటి మట్టాలను నిర్వహించాలని తెలిపారు. అలాగే అన్ని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో 3 నెలలకు సరిపడా ఆలమ్/పిఏసి, క్లోరిన్ నిల్వలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
తాగునీటి సమస్యల పరిష్కారానికి టోల్-ఫ్రీ నంబర్ 1916 పై ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నోటీసు బోర్డులు, డప్పు చాటింపులు, స్థానిక వార్డు గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. రోజువారీ నివేదికలను సేకరిస్తూ, వారపు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.
తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి తాగునీటి ఎద్దడి కలగకుండా చూడాలని కలెక్టర్ హెచ్చరించారు.
ఎల్నినో దృష్ట్యా అడిగిన వారికి పనిదినాలు కల్పించాలని కలెక్టర్ అన్నారు. అన్ని గ్రామపంచాయతీల్లో పనులు గుర్తించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ రెండో విడత ఇండ్ల మంజూరు ప్రక్రియను పూర్తి చేసి, నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ శేఖర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వినోద్ కుమార్, ఎంపీడీవో లు, ఎంపీవోలు, మిషన్ భగీరథ ఏఈ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.