prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 6:42 pm Digital Edition : PRAJA VANI

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.3.50 లక్షల విలువైన పరికరాల వితరణ

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.3.50 లక్షల విలువైన పరికరాల వితరణ

సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చిన నాగరాజు, రామకృష్ణలను అభినందించిన మంత్రి శ్రీధర్‌బాబు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా, నవంబర్ 4:

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తమ తల్లిదండ్రులైన సత్తమ్మ, అంజయ్యల జ్ఞాపకార్థం రూ.3.50 లక్షల విలువైన పరికరాలను వివిధ సంస్థలకు అందజేసేందుకు ముందుకొచ్చిన కరీంనగర్‌కు చెందిన ఆర్‌కే ఆగ్రోస్ అధినేతలు మియాపురం నాగరాజు, రామకృష్ణలను మంత్రి అభినందించారు.

బుధవారం మంత్రి నివాసంలో నాగరాజు, రామకృష్ణ సోదరులు శ్రీధర్‌బాబును కలిసి తమ సేవా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కొండయ్యపల్లి గ్రామపంచాయతీకి రూ.1.50 లక్షల విలువైన పారిశుద్ధ్య పరికరాలను అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మంథని నియోజకవర్గంలోని ముత్తారం కస్తూర్బా బాలికల వసతి గృహానికి రూ.2 లక్షల విలువైన ఆటోమేటిక్ చపాతీ తయారీ యంత్రాన్ని బహూకరించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ యంత్రం ద్వారా గంటకు సుమారు 500 చపాతీలను తయారు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. బాలికల వసతి గృహంలో ఆహార తయారీకి ఈ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

తల్లిదండ్రుల జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో చిరస్థాయిగా నిలుపుకోవడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు, విద్యార్థినుల సౌకర్యాలకు తోడ్పడేలా ముందుకొచ్చిన నాగరాజు, రామకృష్ణ సోదరుల సేవాభావాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టేట్ అసిస్టెంట్ డైరెక్టర్ బర్ల రాజు, అడవి శ్రీరాంపూర్ ఉపసర్పంచ్ అనవేన హరిత తిరుపతి పాల్గొన్నారు.