prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 7:19 pm Digital Edition : PRAJA VANI

జనగామ పట్టణ ప్రజల మన్ననలు పొందిన ఎస్ఐ చెన్నకేశవులు కి ఘన సత్కారం

జనగామ పట్టణ ప్రజల మన్ననలు పొందిన ఎస్ఐ చెన్నకేశవులు కి ఘన సత్కారం

బదిలీ పై వెళుతున్నందుకు చిరు సత్కారం చేసిన ప్రముఖులు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10(ప్రజావాణి): జనగామ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ, తన విశిష్ట సేవలతో ప్రజల మన్ననలు, అధికారుల ప్రశంసలు పొందిన చెన్నకేశవులు బదిలీపై తరిగొప్పుల పోలీస్ స్టేషన్‌కు వెళుతున్న సందర్భంగా పట్టణ ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించారు.

జనగామ పట్టణంలో ఎస్ఐగా పనిచేసిన కాలంలో చెన్నకేశవులు శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. నేరాల నియంత్రణ, ప్రజలకు అందుబాటులో ఉండటం, బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించడం, యువతకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం వంటి అంశాల్లో ఆయన ప్రత్యేక ముద్ర వేశారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి, చట్టపరంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకునే తీరుతో అందరి అభిమానాన్ని చూరగొన్నారు.

ముఖ్యంగా జనగామ పట్టణంలో శాంతి భద్రతలను కాపాడడంతో పాటు, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగుతూ పోలీస్ – ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేశారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా విధి నిర్వహణలో ముందుండే ఆయన నిబద్ధతను పట్టణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో యాసారపు కరుణాకర్, కట్కూరి రామకృష్ణ, అబ్దుల్ గఫ్ఫార్, భాస్కర్, మచ్చ కుమార్ తదితరులు పాల్గొని చెన్నకేశవులు ని శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు. ఆయన సేవలు మరెన్నో ఉన్నత శిఖరాలకు చేర్చాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొంది, ఇదే స్ఫూర్తితో ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

తరిగొప్పులలో కూడా ఇదే విధంగా ప్రజలకు అండగా నిలిచి, మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. చెన్నకేశవులు బదిలీ జనగామ ప్రజలకు తీరని లోటు అని, ఆయన లాంటి సమర్థవంతమైన, నిజాయితీ గల అధికారి సేవలు ఎప్పటికీ మరువలేనివని పట్టణ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

అనంతరం చెన్నకేశవులు గారు మాట్లాడుతూ జనగామ ప్రజలు చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారం వల్లే తాను విజయవంతంగా విధులు నిర్వర్తించగలిగానని, ఎక్కడ ఉన్నా ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు.