prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 7:10 pm Digital Edition : PRAJA VANI

జనగామను కరువు జిల్లా గా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలి

జనగామను కరువు జిల్లా గా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలి..

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అది సాయన్న

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు పలు డిమాండ్ల కూడిన వినతిపత్రం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10 (ప్రజావాణి): వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జనగామను కరువు జిల్లాగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ పార్టీ జనగామ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి సొప్పరి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆది సాయన్న మాట్లాడుతూ ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఈశాన్య రుతుపవనాల్లో వర్షాలు పడకపోవడంతో వ్యవసాయ పంటలు, తాగునీటిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. సాధారణ వర్షపాతం 812.5 మి.మీ.లకు గాను 618.7 మి.మీ. మాత్రమే నమోదైందని, 375కి పైగా మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రాజెక్టుల్లో 470 టీఎంసీలకు గాను 170 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, 21,500 చెరువుల్లో 550 చెరువుల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయని తెలిపారు.

20 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని, పత్తి దిగుబడి ఎకరానికి 10-12 క్వింటాళ్ల నుంచి 4-5 క్వింటాళ్లకు పడిపోయిందని, వరి సాగు 12.15 లక్షల ఎకరాలు తగ్గిందని అన్నారు.

*సీపీఐ డిమాండ్లు:*
– జనగామ జిల్లాలో 12 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి
– చెరువులు, కుంటలు నీరు నింపాలి, పొట్టకొచ్చిన వరికి సాగునీరు, కోతలు లేని కరెంట్ ఇవ్వాలి
– వరికి ఎకరాకు రూ.30,000, పత్తి, మిర్చికి రూ.50,000, ఇతర పంటలకు రూ.20,000 నష్టపరిహారం ఇవ్వాలి
– కౌలు రైతులను గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలి, రబీ సాగు లేని రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి
– కరువు నివేదికలు కేంద్రానికి పంపి నిధులు రాబట్టాలి, ప్రాజెక్టుల నీటి లభ్యతపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– గ్రామ పంచాయతీలకు తాగునీటికి ప్రత్యేక నిధులు, పశువులకు మేత, చౌక దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసరాలు సరఫరా చేయాలి
– వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులకు విబిజి రామ్ జీ ద్వారా అదనపు పనిదినాలు, అసంఘటిత కార్మికులకు ఉపాధి కల్పించాలి
– ఇళ్లు లేని పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

ఈ కార్యక్రమంలో కావాటి యాదగిరి, రావుల సదానందం, ఉరటి వెంకటాద్రి, మురారి కార్ సుదర్శన్, గాయ నగేష్, గుగులోత్ సఖి, కె. లక్ష్మి, భూక్య సత్యవతి, యాదగిరి, చింతల లక్ష్మి, మోటే శ్రీశైలం, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.