prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 7:23 pm Digital Edition : PRAJA VANI

జనగామను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి..

జనగామను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి..

-సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10(ప్రజావాణి) : ఎల్-నినో ప్రభావంతో ఈ ఖరీఫ్‌లో రైతులు అప్పులు చేసి పంటలు వేసినా దిగుబడి లేక తీవ్రంగా నష్టపోయారని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జనగామను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి పంట నష్ట పరిహారం ఇవ్వాలని, గత రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. జనగామ, స్టేషన్ ఘనపూర్ పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 200 రోజులు ఉపాధి హామీ పని కల్పించాలన్నారు.

జూలై నుంచే దేవాదుల ద్వారా చెరువులు నింపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. 15వ తేదీ తర్వాత జిల్లా వ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాలు చేపడతామన్నారు.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. లక్ష్మణ్ గౌడ్ మృతికి కూడా ఇదే కారణమన్నారు.

జనగామలో 2012-13లో ఇందిరమ్మ స్కీం కింద ఇచ్చిన 1114 ఇండ్ల స్థలాల్లో 72 మందికి 2023లో డ్రా ద్వారా ఇండ్లు ఇచ్చినా, కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే కలెక్టర్ వారిని తొలగించి కొత్తవారికి ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ప్రజా సమస్యలపై సిపిఎం ఇచ్చిన రిప్రజెంటేషన్‌ను కూడా కలెక్టర్ తీసుకోకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. అధికారుల పని తీరు మార్చుకోవాలని, లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు బోడ నరేందర్, పోత్కనూరి ఉపేందర్, బి. గణేష్, పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం, కచ్చగళ్ల వెంకటేష్, బాధితులు శోభ, బూడిది అంజమ్మ, బూడిది రాజమని, కవిత, పాలమాకుల మంజుల, నర్షయ్య తదితరులు పాల్గొన్నారు.