prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 8:10 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

చదువులో వెనుకబడిన విద్యార్థులకు వీకెండ్ తరగతులు

ఘట్‌కేసర్, అక్టోబర్ 31 (ప్రజా వాణి): విద్యాపరంగా వెనుకబడిన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం వీకెండ్ తరగతులు నిర్వహించారు. సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల జాతీయ సేవా పథకం విద్యార్థుల సహకారంతో నిర్వహించిన ఈ తరగతుల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల భాషల్లో చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని గుర్తించి, వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు, వెనుకబడిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నేర్చుకోవాలనే ఆసక్తిని పెంపొందించడమే కార్యక్రమ లక్ష్యమని స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్. దాసు, ఉపాధ్యాయులు శివకుమార్, లక్ష్మీ కల్పన, జాతీయ సేవా పథకం విద్యార్థులు పాల్గొన్నారు.