prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 7:50 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి

కడప జిల్లా నవంబర్ 11ప్రజావాణి పోరుమామిళ్ల: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలీసు వ్యవస్థ పూర్తి నిష్పక్షపాతంగా, సక్రమంగా పని చేయాలని మాజీ పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్‌మెంట్ ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో సామాన్య ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, గతంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పోలీసు శాఖ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో చోటుచేసుకున్న వాస్తవ పరిస్థితులను జాతీయ మీడియా మరియు పత్రికలు ఎత్తిచూపాయని ఆయన పేర్కొన్నారు. పోలీసుల పనితీరుపై సామాన్య ప్రజలతో పాటు మేధావులు, ప్రతిపక్షాలు, వామపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారని తెలిపారు. ఆనాటి పరిణామాలు పోలీసు వ్యవస్థ ప్రతిష్టకు ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయని వామపక్ష నేతలు, మేధావులు ఘాటుగా విమర్శించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

పోలీసు శాఖ ప్రతిష్టను కాపాడుకోవాలి

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా పార్టీ రహితంగా జరిగేవని నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. గతంలో అధికార పార్టీకి అనుకూలంగా జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం ద్వారా పోలీసు శాఖ తనకు పోయిన పరువును, ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. గ్రామ ప్రజలు నేరుగా ఎన్నుకునే సర్పంచ్ ఎన్నికలు కాబట్టి, ప్రతి ఓటరు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా భద్రత కల్పించాలని కోరారు.

గ్రామాల్లో శాంతిభద్రతలు – అధికారుల బాధ్యత

గ్రామీణ స్థాయిలో ఎన్నికలను సక్రమంగా నిర్వహించకపోతే గ్రామాల్లో కక్షలు, ఫ్యాక్షన్ గొడవలు చెలరేగే ప్రమాదం ఉందని నాగార్జున రెడ్డి హెచ్చరించారు. ఒకవేళ ఎన్నికల నిర్వహణలో లోపాలు జరిగి గ్రామాల్లో అశాంతి నెలకొంటే, అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులే వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తప్పు చేసిన వారికి ‘కర్మ సిద్ధాంతం’ తప్పదని నాగార్జున రెడ్డి హెచ్చరించారు. మరో రెండు సంవత్సరాల్లో మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వారే అర్థం చేసుకోవాలని నాగార్జున రెడ్డి వ్యాఖ్యానించారు.