కుమ్రంభీమ్ పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం
గిరిజనుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.. విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్, ఎమ్మెల్యే
దండేపల్లి, నవంబర్ 1 (ప్రజావాణి):
గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల అభివృద్ధికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తున్నాయని తెలిపారు.
ఆదివారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కుమ్రంభీమ్ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, డీసీపీ ఎ.భాస్కర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సురేష్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1940లో జల్, జంగల్, జమీన్ నినాదంతో గిరిజనుల నీరు, అడవి, భూమి హక్కుల కోసం కుమ్రంభీమ్ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం అర్హులైన గిరిజనులకు అటవీ హక్కుల పట్టాలు అందిస్తామని, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై వారికి ఉన్న హక్కులను పరిరక్షించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు.
అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్, రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛందంగా పునరావాసానికి ముందుకు వచ్చే గ్రామస్తులకు న్యాయబద్ధమైన పరిహారంతో పాటు భూమి, నివాసం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఎవరికీ బలవంతపు పునరావాసం ఉండదని స్పష్టం చేశారు.
ఆదివాసీల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కుమ్రంభీమ్ త్యాగాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేస్తూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు.
ఆదివాసీ కుటుంబాలకు శాశ్వత ఆదాయ మార్గాలు కల్పించేందుకు సుమారు 200 కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున ఆయిల్‌పామ్ సాగు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. సోలార్ పంపుసెట్లు, డ్రిప్, మైక్రో ఇరిగేషన్ సౌకర్యాలతో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
దండేపల్లి ప్రాంతంలో సుమారు రూ.3 కోట్లతో 100 మంది విద్యార్థులకు వసతి కల్పించే హాస్టల్ నిర్మాణం జరుగుతోందని, లింగాపూర్లోనూ వసతి గృహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఇంటర్నేషనల్ హైస్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరుకుందని, త్వరలో ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అదనంగా 50 పడకల క్రిటికల్ కేర్, ట్రామా కేర్ సేవలతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతోందన్నారు.
రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు సుమారు రూ.85 కోట్లతో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు అనుమతులు మంజూరై, టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది రెండో పంట సాగు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోందన్నారు.
పద్మల్‌పురి కాకోబాయి దేవస్థానంలో ప్రత్యేక పూజలు
విగ్రహ ఆవిష్కరణ అనంతరం మండలంలోని గుడిరేవు గ్రామంలో ఉన్న పద్మల్‌పురి కాకోబాయి (ఎత్మసార్) దేవస్థానాన్ని ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గూడెం సమీపంలోని గోదావరి తీరంలో చేపట్టిన పుష్కర ఘాట్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, వివిధ శాఖల అధికారులు లక్షిపెట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు నిలికి వెంకటపూర్ సహకార సంఘం చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ , కాంగ్రెస్ జిల్లా నాయకుడు గడ్డం త్రిమూర్తి మండలంలోని సర్పంచులు ఎంపిటిసిలు కాంగ్రెస్ నాయకులు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.