prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 9:15 pm Digital Edition : PRAJA VANI

కామారెడ్డి గూడెం గ్రామ విద్యుత్ సమస్య పై ఎఈ కి వినతిపత్రం ఇచ్చిన సర్పంచ్ చింత రవి

కామారెడ్డి గూడెం గ్రామ విద్యుత్ సమస్య పై ఎఈ కి వినతిపత్రం ఇచ్చిన సర్పంచ్ చింత రవి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 02 (ప్రజావాణి):
జిల్లా లోని దేవరుప్పుల మండలం, కామారెడ్డిగూడెం గ్రామంలో గత కొన్ని నెలలుగా ప్రజలను వేధిస్తున్న తీవ్ర విద్యుత్ సమస్యలపై గ్రామ సర్పంచ్ చింత రవి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచ్ రవి, సోమవారం దేవరుప్పుల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ నర్సింహారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి, గ్రామ విద్యుత్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

గ్రామంలోని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ప్రధాన రహదారిలో విద్యుత్ తీగలు పూర్తిగా కిందకు వేలాడుతున్నాయని, వాహనాలు వెళితే తగిలేంత ప్రమాదకరంగా ఉన్నాయని సర్పంచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిన్నపాటి గాలి వీచినా, వర్షం పడినా వెంటనే కరెంటు పోతుందని, గంటల తరబడి అంతరాయం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, గ్రామ విస్తరణ జరిగినప్పటికీ కొత్త కాలనీలకు అదనపు కరెంటు స్తంభాలు వేయకపోవడం వల్ల ఓవర్ లోడ్ సమస్య తలెత్తుతోందని, దీని వల్ల ట్రాన్స్ ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయని తెలిపారు. కొన్ని ఇండ్ల పై నుండి 11 కేవీ హై టెన్షన్ వైర్లు వెళ్లడం వల్ల ప్రజలు ప్రాణభయంతో బతుకుతున్నారని, ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారని వివరించారు.

రైతులకు వ్యవసాయ పనులకు, విద్యార్థులకు చదువులకు, గృహిణులకు ఇంటి పనులకు నిరంతర విద్యుత్ ఎంతో అవసరమని, కాబట్టి వెంటనే ఈ క్రింది పనులు చేయాలని కోరారు.

1. గ్రామంలో వేలాడుతున్న లూజ్ వైర్లన్నింటినీ బిగించాలి.
2. ప్రమాదకరంగా ఇండ్ల మీద ఉన్న వైర్లను తొలగించి, సురక్షిత మార్గంలో మళ్లించాలి.
3. అవసరమైన చోట్ల అదనపు విద్యుత్ స్తంభాలు, కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి.

దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ నర్సింహారెడ్డి , సర్పంచ్ ఇచ్చిన వినతిని పరిశీలించి, త్వరలోనే తమ సిబ్బందితో గ్రామాన్ని సందర్శించి, సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ లైన్ మెన్ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. సమస్యలపై స్పందించిన సర్పంచ్ చింత రవి కి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.