prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 3:01 pm Digital Edition : PRAJA VANI

కడవెండిలో ఘనంగా నల్ల నరసింహులు 33వ వర్ధంతి

కడవెండిలో ఘనంగా నల్ల నరసింహులు 33వ వర్ధంతి

అమరుడి పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం – ఏల సుందర్

ఆయన త్యాగాలు తరతరాలకు ఆదర్శం.. ప్రజా హక్కుల కోసం నిరంతర పోరాటమే నిజమైన నివాళి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 05 (ప్రజావాణి): జిల్లాలోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, విప్లవ పోరాటాల స్ఫూర్తిప్రదాత, ప్రజా హక్కుల కోసం జీవితాంతం పోరాడిన అమరుడు నల్ల నరసింహులు 33వ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా, భావోద్వేగభరిత వాతావరణంలో నిర్వహించారు. గ్రామంలోని స్మారక స్థూపం వద్ద గ్రామస్థులు, బీఆర్ఎస్ నాయకులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమరుడి స్మారక స్థూపం వద్ద, అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు ఏల సుందర్ స్మారక స్థూపానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్ల నరసింహులు జీవిత చరిత్రను, పోరాట పటిమను వివరంగా గుర్తుచేశారు.
నల్ల నరసింహులు జీవితం అన్యాయంపై అలుపెరుగని పోరాటానికి, అణగారిన ప్రజల హక్కుల సాధనకు నిలువెత్తు నిదర్శనమని ఏల సుందర్ పేర్కొన్నారు. నిజాం పాలనలో దొరల అణచివేతకు వ్యతిరేకంగా, వెట్టిచాకిరి విముక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు.
“నల్ల నరసింహులు కేవలం ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక ఉద్యమం. ఒక స్ఫూర్తి. ఒక ఆదర్శం. ప్రజల విముక్తి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల పక్షాన నిలబడి పోరాడిన ఆయన ధైర్యసాహసాలు, త్యాగనిరతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి” అని ఏల సుందర్ కొనియాడారు.
ఆయన ఆశయాలను కేవలం వర్ధంతి, జయంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. సమాజంలో అసమానతలు తొలగిపోయి, పేదలు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

గ్రామ అభివృద్ధి, యువతకు ఉపాధి, రైతుల సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమం కోసం అందరూ కలిసి పని చేయాలని, నల్ల నరసింహులు చూపిన మార్గంలో నడవాలని ఏల సుందర్ సూచించారు. ఆయన స్ఫూర్తితోనే కడవెండి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ఈ వర్ధంతి కార్యక్రమంలో కడవెండి గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు, ఉప సర్పంచ్ నక్క రేణుక కొమరయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటిపల్లి మహేష్, బిట్ల రామసోక్కం, సుడిగెల హనుమంతు, పడమటింటి కొమరయ్య, కాశబోయిన యాకన్న, కత్తుల సుధాకర్, భాషిపాక సతీష్, నిలసర్ప ప్రభాకర్, గుమ్మడవెల్లి సోమన్న, నల్ల వీరస్వామి, నల్ల యాదగిరి, నల్ల ఉపేందర్, నల్ల రామచంద్రు, చింతకింది మహేష్, బెల్లి సోమయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.