prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 1:07 pm Digital Edition : PRAJA VANI

ఎల్లాపూర్‌లో ఆర్టీసీ బస్సు – కారు ఢీ

ఎల్లాపూర్‌లో ఆర్టీసీ బస్సు – కారు ఢీ

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కారు ధ్వంసం.. కుటుంబ సభ్యులకు తప్పిన ప్రాణాపాయం!

హసన్‌పర్తి, నవంబర్ 4 (మన ప్రజావాణి):

హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కియా సోనెట్ కారు ఢీకొన్న ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు పట్టణానికి చెందిన తుర్పటి రావు తన కుటుంబ సభ్యులు సరిత, పల్లకి గౌరమ్మ, చార్లెస్ వరుణ్‌తో కలిసి ఎల్లాపూర్ గ్రామ పరిధిలోని మాంటిసోరి పాఠశాలలో చదువుకుంటున్న తమ పిల్లలను చూసేందుకు కియా సోనెట్ కారులో (TS 03 FF 6766) వెళ్లారు. అనంతరం తిరుగు ప్రయాణంలో నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో పాఠశాల గేటు వెలుపల రోడ్డుపైకి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కారు ధ్వంసం..

కరీంనగర్ వైపు నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (TS 22 Z 0017) డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి కారును ఢీకొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై సుమారు రూ.1.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు..

ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను కొత్తపల్లి అనిల్, తండ్రి బాలయ్యగా పోలీసులు గుర్తించారు. బాధితుడు తుర్పటి రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆదేశాలతో దర్యాప్తు..

హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.