prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 5:31 pm Digital Edition : PRAJA VANI

ఎలక్టోరల్ క్లబ్ పోటీల్లో సాయి మెరిట్ విద్యార్థుల ప్రభంజనం

ఎలక్టోరల్ క్లబ్ పోటీల్లో సాయి మెరిట్ విద్యార్థుల ప్రభంజనం

క్విజ్, వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతులు కైవసం.. ప్రతిభ చాటిన సాయి మెరిట్ హైస్కూల్ విద్యార్థులు

ముదిగొండ, నవంబర్ 7 ప్రజావాణి
విద్యార్థుల్లో ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల విధానంపై అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముదిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎలక్టోరల్ క్లబ్ ఆధ్వర్యంలో క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కమలాపురం సాయి మెరిట్ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో ప్రభంజనం సృష్టించారు. పాఠశాల స్థాయిలో నిర్వహించిన రెండు విభాగాల్లోనూ ప్రథమ బహుమతులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.మండల తహసీల్దార్ బాబ్జి ప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి డి. రమణయ్య ఎస్ఏ తెలుగు దేవయ్య పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని 13 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యత, ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, పౌరుల బాధ్యతలు తదితర అంశాలపై విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

క్విజ్‌లో షేక్ సనకు ప్రథమ బహుమతి

పాఠశాల స్థాయి క్విజ్ పోటీలో కమలాపురం సాయి మెరిట్ హైస్కూల్‌కు చెందిన షేక్ సన ప్రథమ బహుమతి సాధించి ప్రతిభ చాటారు. జెడ్పీహెచ్‌ఎస్ పమ్మికి చెందిన టి. అభిరామ్ ద్వితీయ బహుమతి పొందారు. అలాగే వ్యాసరచన పోటీలో సాయి మెరిట్ హైస్కూల్ విద్యార్థిని టి. నిషిత ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, పమ్మి పాఠశాలకు చెందిన పి. కావ్యశ్రీ ద్వితీయ బహుమతి సాధించారు.

ఒకే పాఠశాలకు చెందిన షేక్ సన, టి. నిషిత వేర్వేరు విభాగాల్లో ప్రథమ బహుమతులు సాధించడం విశేషం. మండలంలోని 13 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న పోటీల్లో సాయి మెరిట్ విద్యార్థులు మొదటి స్థానాల్లో నిలవడం పాఠశాల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. క్విజ్‌లో విషయ పరిజ్ఞానాన్ని, వ్యాసరచనలో తమ ఆలోచనా శక్తిని ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

కళాశాల స్థాయి పోటీల్లోనూ విజేతలు

కళాశాల స్థాయి క్విజ్ పోటీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ముదిగొండకు చెందిన పి. దేవిశ్రీ ప్రథమ బహుమతి సాధించగా, అంజలి ద్వితీయ బహుమతి పొందారు. వ్యాసరచన పోటీలో అదే కళాశాలకు చెందిన డి. మానస ప్రథమ స్థానంలో నిలవగా, న్యూ లక్ష్మీపురం కేజీబీవీకి చెందిన సిహెచ్. మానస ద్వితీయ బహుమతి సాధించారు.

విద్యార్థుల విజయంపై కరస్పాండెంట్ హర్షం.

సాయి మెరిట్ హైస్కూల్ విద్యార్థులు రెండు విభాగాల్లో ప్రథమ బహుమతులు సాధించడంపై పాఠశాల కరస్పాండెంట్ కందుల శంకరయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూరంపల్లి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి విజ్ఞాన పోటీల్లోనూ పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహించాలని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. భవిష్యత్తులోనూ విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జీపీఓలు డి. చంద్రశేఖర్, ఎస్. వెంకటేశ్వర్లు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.

మొత్తంగా ఎలక్టోరల్ క్లబ్ పోటీల్లో సాయి మెరిట్ హైస్కూల్ విద్యార్థులు రెండు ప్రథమ బహుమతులు సాధించడం మండలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చదువుతో పాటు విజ్ఞాన, వ్యాసరచన పోటీల్లోనూ ముందంజలో ఉంటూ సాయి మెరిట్ విద్యార్థులు తమ విజయ పరంపరను కొనసాగిస్తున్నారు.