ఉత్తమ ఉపాధ్యాయుడు చాకలి కృష్ణకు ఘన సన్మానం.
పరిగి/కుల్కచర్ల:నవంబర్ 1,ప్రజావాణి :
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం, కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చాకలి కృష్ణ ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఎర్రం పోటీ మల్లేష్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రం పోటీ మల్లేష్ మాట్లాడుతూ.. విద్యా రంగంలో విశేష సేవలందిస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన చాకలి కృష్ణ సాధించిన గుర్తింపు ఇప్పాయిపల్లి గ్రామానికే గర్వకారణమని కొనియాడారు. గ్రామానికి చెందిన ప్రతి ఉద్యోగి కూడా తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి, సమాజానికి మేలు చేస్తూ గ్రామానికి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు వెన్నచెట్టి ఆంజనేయులు, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకుడు పసుల మల్లయ్యలతో పాటు స్థానిక నాయకులు బాల్ రెడ్డి, మాలే రఘు గౌడ్, ఆనంద్, శంకర్, మహేందర్ గౌడ్, వెన్నచెట్టి నరసింహులు, వెంకటయ్య తదితరులు పాల్గొని కృష్ణకు అభినందనలు తెలిపారు.