అయ్యప్ప మాలధారణపై రెయిన్‌బో స్కూల్ యాజమాన్యం ఆంక్షలు!
* మాల ధరించారని విద్యార్థులను పాఠశాలలోకి రానివ్వని మేనేజ్‌మెంట్
* హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ అయ్యప్ప స్వాముల ఆగ్రహం
* రెయిన్‌బో స్కూల్ గేటు వద్ద స్వాముల నిరసన.. ఎంఈఓ, పోలీసుల జోక్యంతో సమస్య పరిష్కారం
అమీన్‌పూర్, నవంబర్ 4 (ప్రజావాణి):బీరంగూడ ప్రధాన రహదారిపై ఉన్న రెయిన్‌బో పాఠశాలలో అయ్యప్ప మాల ధరించిన విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. మాలధారణ చేసిన విద్యార్థులతో పాటు బస్సు డ్రైవర్లను కూడా పాఠశాలలోకి రావద్దని యాజమాన్యం అనుమతించకపోవడంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని గేటు ముందు నిరసన చేపట్టారు. అయ్యప్ప మాలధారణపై అభ్యంతరం వ్యక్తం చేయడం హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న అమీన్‌పూర్ ఎస్‌ఐ విజయరావు, ఎంఈఓ సుధాకర్ పాఠశాలకు చేరుకుని యాజమాన్యంతో చర్చలు జరిపారు. వారి జోక్యంతో సమస్య పరిష్కారం కావడంతో మాలధారణ చేసిన విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించారు. దీంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్తత సద్దుమణిగింది.