అధిక వేగంతో ప్రయాణిస్తున్న రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు స్వాధీనం
తిరుపతి, నవంబర్ 10: ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అధిక వేగంతో ప్రయాణిస్తున్న రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర రవాణా శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా అందిన వేగ నియంత్రణ పర్యవేక్షణ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుతో పాటు, హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తున్న మరో బస్సు నిర్దేశిత వేగ పరిమితులను ఉల్లంఘిస్తూ అధిక వేగంతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే స్పందించిన రవాణా శాఖ అధికారులు ఆయా బస్సులను గుర్తించి తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీల్లో మోటార్ వాహన తనిఖీ అధికారులు స్వర్ణలత, ప్రసాద్ వర్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తప్పనిసరిగా నిర్దేశించిన వేగ పరిమితులను పాటించాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సుల డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలనే తొందరలో అధిక వేగంతో వాహనాలు నడిపి ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని హెచ్చరించారు.
రాష్ట్ర రవాణా శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా బస్సుల వేగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించి అధిక వేగంతో ప్రయాణించే వాహనాలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్రావెల్స్ యాజమాన్యాలు తమ డ్రైవర్లకు వేగ నియంత్రణపై తగిన సూచనలు, హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.
ప్రయాణికుల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా రవాణా శాఖ తనిఖీలు కొనసాగిస్తుందని జిల్లా రవాణా శాఖ అధికారి తెలిపారు.
– జిల్లా రవాణా శాఖ అధికారి, తిరుపతి