prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 5:37 pm Digital Edition : PRAJA VANI

8వ ప్రపంచ తెలుగు సాహితీ మహోత్సవాలకు జనగామ కవి మాన్యపు భుజేందర్ కు ఆహ్వానం

8వ ప్రపంచ తెలుగు సాహితీ మహోత్సవాలకు జనగామ కవి మాన్యపు భుజేందర్ కు ఆహ్వానం..

జిల్లా సాహితీ వర్గాల్లో హర్షాతిరేకం
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 17(ప్రజావాణి): తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణే లక్ష్యంగా దేశ విదేశాల్లో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ మహోత్సవాలకు తెలంగాణలోని జనగామ జిల్లా బిడ్డకు అరుదైన ఆహ్వానం లభించింది.

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, మహాకవి బమ్మెర పోతన జన్మస్థలమైన బమ్మెర గ్రామానికి చెందిన ప్రముఖ కవి, కళాకారుడు, పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యపు భుజేందర్ ఈ ప్రతిష్టాత్మక మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా అధికారిక ఆహ్వానం అందింది. నవంబర్ 1, 2026 ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం రూరల్, ధవళేశ్వరంలోని గౌతమి సదన్ ఆడిటోరియంలో ఈ సాహితీ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.

ఈ మహోత్సవంలో భాగంగా..
1. ప్రపంచ కవి సమ్మేళనం – దేశ విదేశాల కవుల కవితా గానం
2. సాహిత్య సదస్సులు, సాహిత్య చర్చా వేదికలు
3. కొత్త పుస్తకాల ఆవిష్కరణలు
4. కూచిపూడి, భరతనాట్యం, కోలాటం వంటి సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు
5. జానపద కళారూపాల ప్రదర్శనలు
6. సాహితీ ప్రముఖులకు సన్మానాలు, పురస్కారాల ప్రధానం నిర్వహించనున్నారు.

శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, ప్రణాళిక అధికార ప్రతినిధి టీ పార్థసారథి మాన్యపు భుజేందర్ కి ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని పంపించారు.
తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లయిన బమ్మెర గ్రామం నుండి, పోతన సాహిత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న భుజేందర్ గారికి ఈ ఆహ్వానం రావడం ఎంతో ప్రత్యేకం. గత కొన్నేళ్లుగా ఆయన తెలుగు భాష, పోతన సాహిత్యంపై చేస్తున్న కృషి, నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ఆహ్వానం లభించింది.

ఈ మహోత్సవాలకు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, దుబాయ్ తదితర దేశాల నుండి, అలాగే తెలుగు రాష్ట్రాల నుండి వందలాది మంది ప్రముఖ కవులు, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు హాజరుకానున్నారు.

జనగామ జిల్లా నుండి మాన్యపు భుజేందర్ కి ఈ అంతర్జాతీయ సాహితీ వేదికపై ఆహ్వానం లభించడం పట్ల జిల్లా సాహితీ మిత్రులు, ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, యువ రచయితలు మరియు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.