దారి ఇలా…నడిచేదెలా.
చినుకు పడితే చిత్తడే,
ఆద మరిచి అడిగితే అంతే.
ఏటూరునాగారం అక్టోబరు 31 ప్రజావాణి:
చిన్నపాటి చినుకు పడినా చాలు,ఊర్ల మధ్య ఉన్న ప్రధాన రహదారులు బురదమయంగా మారి నరకాన్ని తలపిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక రోడ్డు పైనే చేరడంతో మట్టి కొట్టుకుపోయి మోకాలు లోతు గుంతలు ఏర్పడుతున్నాయి. రోడ్డుపై వాహనాలు రాకపోకలు సాగించడంతో బురద గుంటలుగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే వృద్ధులు, గర్భిణులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు జారిపడి పలువురికి గాయాలవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తుల డిమాండ్:
పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, తక్షణమే బురద రహదారులకు శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్లు లేదా తార్ రోడ్లు నిర్మించి, నీటి పారుదల కల్వర్టులను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.