*చండూరు మున్సిపాలిటీ లో ప్లాస్టిక్ వినియోగం నివారణ పై కిరాణా వ్యాపారులతో అవగాహన సమావేశం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
చండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ కిరాణా షాపుల అసోసియేషన్ సభ్యులతో చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, కమిషనర్ ఎల్. మల్లేశం మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మురుగు కాలువల్లో పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్యలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగం నిషేధించబడిందని వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని వ్యాపారులకు సూచించారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా పేపర్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు మరియు జూట్ బ్యాగులను వినియోగించాలని కోరారు. ఈ సమావేశంలో కిరాణా వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగ సూచనలతో పాటు మరికొన్ని సూచనలు చేయడం జరిగింది:- గడువు ముగిసిన వస్తువులు: Expiry Date ముగిసిన ఆహార పదార్థాలు, ఇతర వినియోగ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడదు. గడువు తేదీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. డస్ట్‌బిన్ ఏర్పాటు: ప్రతి దుకాణం ముందు తప్పనిసరిగా డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకోవాలి. దుకాణం వద్ద ఏర్పడే చెత్తను రోడ్లపై, మురుగు కాలువల్లో వేయకుండా డస్ట్‌బిన్‌లోనే వేయాలి. ఫుట్‌పాత్ ఆక్రమణలు: దుకాణాలకు సంబంధించిన సరుకులు, వస్తువులు, ఇతర సామగ్రిని ఫుట్‌పాత్‌లపై ఉంచకూడదు. పాదచారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్: మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మున్సిపాలిటీ నుండి ట్రేడ్ లైసెన్స్ పొందాలి. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించరాదు. ఈ సందర్భంగా కిరాణా వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి, చండూరు పట్టణములోని మెయిన్ సెంటర్ లలో సి.సి. కెమెరాల ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామని కూడా తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చండూరు మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారులు, ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.