కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. రోడ్డెక్కిన మురుగునీరు
డ్రైనేజీ పనులు అసంపూర్తి.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు
మంథని నియోజకవర్గ ప్రతినిధి, అక్టోబర్ 30, ప్రజావాణి:
పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాల నుంచి వెలువడుతున్న మురుగునీరు రోడ్డుపైకి చేరి కాలువలా ప్రవహిస్తోంది. డ్రైనేజీ పనులు పూర్తికాకపోవడంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.