3వ వార్డులో డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై ఎఈ క్షేత్రస్థాయి పరిశీలన
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జనగామ పట్టణంలోని మూడవ వార్డులో డ్రైనేజీ, రోడ్లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పట్టణానికి దిగువ ప్రాంతంలో ఉన్న ఈ వార్డుకు ఎగువ ప్రాంతాల నుంచి మురుగునీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొత్త కాలనీలతో విస్తరిస్తున్న ఈ వార్డు నుంచి మున్సిపాలిటీకి ఆస్తి పన్నులు, నిర్మాణ అనుమతుల ద్వారా భారీ ఆదాయం వస్తున్నప్పటికీ మౌలిక వసతులు లేకపోవడంపై కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన అధికారులు వార్డులో సమస్యలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయాలని మున్సిపల్ ఎఈ సత్యమూర్తి కి ఆదేశాలు జారీ చేశారు.
కౌన్సిలర్ బూడిద జ్యోతి ఆధ్వర్యంలో బుధవారం బాలాజీ నగర్, జ్యోతి నగర్, ఎల్లమ్మ గుడి ఏరియా, రాజమౌళి హాస్పిటల్ వెనుక, జీఎంఆర్ కాలనీ, ఏకశిలా కాలనీ తదితర ప్రాంతాల్లో ఎఈ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గుర్తించిన డ్రైనేజీ, సీసీ రోడ్ల ప్రతిపాదనలను చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.