*12 వేతన ఒప్పందంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మౌనం వీడాలి*
*ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన రోజే సిలబస్, పరీక్ష తేదీని తెలపాలి*
*ఎస్సిఈయు (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి*
*మన ప్రజావాణి*
* మందమర్రి:-
బొగ్గు గని కార్మికుల పిఎల్ఆర్ బోనస్ పై గొప్పలు చెబుతున్న కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, 12వ వేతన ఒప్పందం కమిటీ ఏర్పాటు గురించి ఎందుకు స్పందించట్లేదని, వేతన ఒప్పందం కమిటీ పై కేంద్ర మంత్రి మౌనం వీడాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సింగరేణి ఏరియాలోని కాసీపేట 2 గని పై బాసబోయిన కుమారస్వామి అధ్యక్షతన ద్వార సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో గని యూనియన్ పిట్ కార్యదర్శి బుద్దె సురేష్ ఆధ్వర్యంలో వినయ్, ఎం కుమార్ లు యూనియన్ లో చేరగా, వారికి ఆయన యూనియన్ కండువాలు కప్పి, సాదరంగా యూనియన్ లోకి ఆహ్వానించారు. అనంతరం రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన రోజే పరీక్ష తేదీ, సిలబస్ ను తెలియజేయడం వలన కార్మికులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని, ఆ దిశగా యాజమాన్యం ఆలోచించాలని సూచించారు. మైనింగ్ సిబ్బందికి ఇటీవల జరిగిన మెడికల్ బోర్డులో జనరల్ అసిస్టెంట్ గా ఇవ్వడం వలన వారు మానసికంగా కృంగిపోతున్నందున సూటబుల్ జాబ్ ఉత్తర్వులు పునరుద్ధరించి, మళ్ళీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్స్ ప్లోజివ్స్ మార్చడం వలన షార్ట్ పైరర్స్, కోల్ కట్టర్లు ఇబ్బంది పడుతున్నందున యాజమాన్యం పునరాలోచించి, వారికి భరోసా కల్పించాలని, అవసరమైతే వాటిని మార్చాలన్నారు. సింగరేణికి విద్యుత్ సంస్థల నుండి బకాయిలు రానందున సంస్థ లాభాలు తెలియజేయడం లేదని విమర్శించారు. గతంలో విద్యుత్ సౌధ వద్ద చేసిన పోరాటంతో కొద్ది మేర కదలిక వచ్చిన రాజకీయ జోక్యంతో ఆగిందని,మళ్ళీ ఈసారి పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని బకాయిల వసూలు పై సంస్థను కాపాడుకోవడానికి పోరాటానికి రూపకల్పన చేస్తామని తెలిపారు. కార్మికులకు గత ఆర్థిక సంవత్సరం సీఎంపిఎఫ్ రికవరీ అయిన డబ్బులు కలవకపోవడంతో కంపెనీ వాడుకుంటుందన్న అనుమానం ఉన్నందున వెంటనే యాజమాన్యం కార్మికులకు భరోసా ఇచ్చే విధంగా సంస్థ ఆర్థిక స్థితిని కార్మికులకు తెలియజేయాలని కోరారు. సీఎంపీఎఫ్ వడ్డీ రేటు తక్కువ కట్టించినందున గతంలో పోరాటం చేసి ఇప్పించమని గుర్తు చేశారు. కార్మికులు ఒకవైపు రిటైర్డ్ అవుతున్న సొంతింటి కలపై ఒప్పందాలు చేశామని నెలరోజులుగా చెప్పుకుంటూపోతున్న ఏఐటీయూసీ నాయకులు ఎప్పటిలోగా అమలు చేయిస్తారో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుండి ఈ దసరా లోపు స్పందన రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష లాంటి పోరాటం తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ గుర్తింపు కాలపరిమితి ముగిసినందునే తమకు గతంలో మాదిరి నాలుగు సంవత్సరాలు కావాలని అడగడంతోటే వారి అధికార దాహం తెలిసిపోతుందని, ఎర్రజెండా యూనియన్ కు అధికారం దాహం ఉండకూడదని హితవు పలికారు. ఎన్నికలంటే జరిగితే అన్ని సంఘాలకు 20 శాతం ఓట్లు వచ్చేలా కార్మికులు ఆదరించాలని, అప్పుడే అన్ని సంఘాలు కలిసి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఈకార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్, ధనిశెట్టి సురేష్, నామాని సురేష్ విద్యాసాగర్, శరణ్,హరీష్, హనుమంతు, శ్రావణ్ కుమార్, నాగరాజు, రాజకుమార్, ధరన్, అనిల్ కుమార్, నవీన్, సూరజ్, యశ్వంత్,సుందర్, నర్సయ్య, రమేష్,శివ, బాలాజీ, అనిల్ కుమార్, సంపత్ అరుణ్, కుమార్, శ్రీనివాస్, సంపత్ లు పాల్గొన్నారు..