prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 8:01 pm Digital Edition : PRAJA VANI

10వేల ఫోనుతో కూలీల ముఖం పడుతుందా? వీబీ-జీ రామ్ జీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆవేదన

*10వేల ఫోనుతో కూలీల ముఖం పడుతుందా? వీబీ-జీ రామ్ జీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆవేదన*

రాయికల్; అక్టోబర్ 21 (ప్రజావాణి)

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి తీసుకొచ్చిన కొత్త పథకం వీబీ-జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్) పథకం. ఈ పథకంలో కీలకంగా పనిచేసేది ఫీల్డ్ అసిస్టెంట్లు. ఉదయం 6 గంటల నుండే లేచి, గ్రామంలోని కూలీలను నిద్ర లేపి, పనుల వద్దకు తీసుకెళ్లి, వారి హాజరు వేసి, మధ్యాహ్నం వరకు ఎండలోనే ఉండి పనులు చేయించేది వీరే.అయితే ఇప్పుడు కూలీల హాజరు విషయంలో ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ప్రతి కూలీ హాజరును ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫేస్ అటెండెన్స్ తీయాలి, జియో ట్యాగింగ్ తో ఫోటోలు పెట్టాలి అని ఆదేశించింది. దీనికోసం ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సొంత డబ్బులతో ఫోన్లు కొనుక్కోవాలని, ప్రభుత్వం తరపున 10,000 రూపాయలు ఇస్తామని చెబుతోంది.దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు భగ్గుమంటున్నారు. “10 వేల రూపాయలతో ఈ రోజుల్లో ఏ ఫోన్ వస్తుంది సార్? అని నిలదీస్తున్నారు. మార్కెట్ లో 10 వేలకు వచ్చే ఫోన్ లో 2జీబి, 3జీబీ రామ్ మాత్రమే ఉంటుంది, కెమెరా క్వాలిటీ 8 మెగా పిక్సెల్ కూడా ఉండదు. అలాంటి ఫోన్ తో ఎన్ఎంఎంఎస్ యాప్ ఓపెన్ చేస్తేనే హ్యాంగ్ అవుతుంది, ఫేస్ అటెండెన్స్ తీసేటప్పుడు కెమెరా బ్లర్ అవుతుంది, ముఖం మ్యాచ్ కాదు, నెట్ వర్క్ లేని చోట యాప్ లాగిన్ కాదు, ఎండలో తిరిగేసరికి ఫోన్ వేడెక్కి స్విచ్ ఆఫ్ అవుతుంది. 100 మంది కూలీలకు ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు ఫోటోలు తీయాలంటే కనీసం 6 గంటలు బ్యాటరీ రావాలి, 10 వేల ఫోన్ లో బ్యాటరీ 2 గంటలకే అయిపోతుంది, దీంతో మా పని ఎలా చేయాలి?” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కు నెల జీతం 10 నుండి 12 వేలు మాత్రమే, అందులో నుండి నెలకు 300 రూపాయల డేటా, రిపేర్లు, పెట్రోల్ ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోంది. పది వేల ఫోన్ కొని అది పనిచేయకపోతే మళ్ళీ అప్పు చేసి ఇంకో ఫోన్ కొనాల్సిన పరిస్థితి. అందుకే ప్రభుత్వం దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకుని, మార్కెట్ ధరలకు అనుగుణంగా మంచి క్వాలిటీ, 8 జిబి రామ్ ,50 మెగా పిక్సెల్ కెమెరా, 6000 ఎంఏ హెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ వచ్చేలా ఫోన్ చార్జీలను 25 వేల రూపాయల వరకు పెంచాలని, అప్పుడే కూలీలకు సకాలంలో హాజరు వేసి, పథకాన్ని సక్రమంగా అమలు చేయగలమని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.