prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 11:33 pm Digital Edition : MAHESH MEDCHAL

హేమాద్రి దేవస్థానంలో వైభవంగా అమ్మవారి శోభాయాత్ర

హేమాద్రి దేవస్థానంలో వైభవంగా అమ్మవారి శోభాయాత్ర

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తిభావం వెల్లివిరిసిన వేళ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

కీసర, ప్రజావాణి: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరలోని హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం అమ్మవారి శోభాయాత్రను ఆలయ నిర్వాహకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. అమ్మవారి నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి దివ్యదర్శనం చేసుకున్న భక్తులు తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు.

*భక్తులకు కుంకుమ, గాజుల ప్రసాదం*

శోభాయాత్రకు హాజరైన భక్తులకు ఆలయ నిర్వాహకులు అమ్మవారి కుంకుమ, గాజులను ప్రసాదంగా అందజేశారు. మహిళా భక్తులు కుంకుమ, గాజులను స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. శరన్నవరాత్రుల విశిష్టతను ప్రతిబింబించేలా నిర్వహించిన ప్రత్యేక పూజలు, శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

*చైర్మన్ కందాడి హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు*

హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కందాడి హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు పూజా కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు భక్తిపారవశ్యంతో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని భక్తులు పేర్కొన్నారు. అమ్మవారి నామస్మరణల మధ్య సాగిన శోభాయాత్ర భక్తుల విశేష స్పందనతో ఘనంగా ముగిసింది.