హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం
• కౌన్సిలర్ పట్లోళ్ల శ్రీనివాస్
జోగిపేట, అక్టోబర్ 01: మన సమగ్ర ప్రజావాణి
మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అందోల్–జోగిపేట మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల శ్రీనివాస్ తెలిపారు.
16వ వార్డు పరిధిలోని ముత్యాలమ్మ గుడి వీధిలో ఎన్నికలకు ముందు తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసిన బోర్ కనెక్షన్లను గురువారం ఇంటింటికీ ఏర్పాటు చేయించారు. దీంతో స్థానిక ప్రజలకు నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తన పదవీకాలంలో సాధ్యమైనంత మేరకు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వార్డు అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని తెలిపారు. 16వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.