ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి):
స్వర్ణకారుల వృత్తి పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ శనివారం హైదరాబాద్లోని ఎల్.బి. నగర్ సరూర్నగర్ గ్రౌండ్స్లో సాయంత్రం 4 గంటలకు ఛలో హైదరాబాద్ – స్వర్ణకార శంఖారావం” పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ సభలో స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెంటనే పాలక మండలిని నియమించాలని, జి.ఓ. ఎం.ఎస్. నం. 272ను సవరించి అమలు చేయాలని, అక్రమ రికవరీలను అరికట్టాలని సంఘం డిమాండ్ చేస్తోంది. అలాగే 50 ఏళ్లు నిండిన స్వర్ణకార వృత్తిదారులకు నెలకు రూ.5 వేల పెన్షన్ అందించాలని, అన్ని బ్యాంకుల్లోని అప్రైజర్లకు సీలింగ్ విధానాన్ని తొలగించి సమానమైన కమిషన్ ఇవ్వాలని కోరుతోంది.
ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కత్రోజ్ వేణుగోపాల చారి ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షులు తాడూరు సుదర్శన్, నరేందర్, చెన్నోజు శేఖర్, ఘట్కేసర్ మండల జిల్లా జాయింట్ సెక్రటరీ గుండోజు కృష్ణమాచారి, చేవూరి లక్ష్మణాచారి, పెద్ది గారి శేఖర్ చారి, గుండోజు అజయ్, విజయ్, వినయ్ చారి, పెద్ది గారి వెంకట చారి, సురోజు రాజు చారి, గుండోజు వేణు చారి, రాఘవేంద్ర చారి, చేవూరి మధు చారి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణకారుల వృత్తి పరిరక్షణ, హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు మేడ్చల్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు.