స్వయం సహాయక సంఘాల ప్రగతి, వివిధ సంక్షేమ పథకాల లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలి… !
జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్
మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
జిల్లా పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, స్వయం సహాయక సంఘాల పురోగతిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత కాలపరిమితిలోగా వంద శాతం సాధించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మెప్మా ఆధ్వర్యంలో నిర్దేశిత లక్ష్యాలను నిర్దేశిత సమయంలో పూర్తి చెయ్యాలన్నారు. జిల్లాలో 1,420 స్వయం సహాయక సంఘాలకు రూ. 22,339.60 లక్షల బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 726 సంఘాలకు రూ. 10,771.35 లక్షల రుణాలు అందించినట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని, అలాగే పంపిణీ చేసిన రుణాల రికవరీ వంద శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జిల్లాలో 564 క్రొత్త స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం 58 సంఘాలు మాత్రమే ఏర్పాటయ్యాయని, నూతన సంఘాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇందిరా మహిళా శక్తి పథకం కింద 307 వ్యక్తిగత యూనిట్లు, 114 గ్రూప్ యూనిట్లకు గాను రూ. 1,393.10 లక్షల వ్యయంతో సాధించిన ప్రగతిని సమీక్షించారు. మిగిలిన యూనిట్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలని సూచించారు. ఉల్లాస్ కార్యక్రమం కింద జిల్లాలో గుర్తించిన 4,395 మంది నిరక్షరాస్యులను త్వరితగతిన అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు వేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించి యూనిఫాంల కుట్టు పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు సమయానికి అందజేయాలని ఆదేశించారు. వీధి వ్యాపారులకు కేటాయించిన రుణాల మంజూరు లక్ష్యాలను వంద శాతం పూర్తి చేసి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.
అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ జరుపుతూ, ప్రతి పథకం యొక్క లక్ష్య సాధనకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దివాకర టి ఎస్ ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో మెప్మా పీడీ నళిని, డిఎంసి సుజాత, ఏడిఎంసి వెంకటేశ్వర రావు, టీఎంసి సుజాత, సివో లు, తదితరులు పాల్గొన్నారు.