prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 4:51 pm Digital Edition : PRAJA VANI

సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి

సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి
పెండింగ్ అల్పాహార బిల్లులు విడుదల చేయాలి
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గుండెపంగు మల్లేష్ డిమాండ్
కూసుమంచి, అక్టోబర్ 28 (మన ప్రజావాణి) ప్రతినిధి RK :
ప్రభుత్వం నూతనంగా తీసుకురావాలని భావిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన అల్పాహార పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఖమ్మం జిల్లా కార్యదర్శి గుండెపంగు మల్లేష్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం కూసుమంచి మండల కేంద్రంలోని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వంట బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందించే అల్పాహార బాధ్యతను మధ్యాహ్న భోజన పథకం కార్మికులకే అప్పగించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు.
వంట కార్మికులకు అవసరమైన కోడిగుడ్లు, గ్యాస్‌తో పాటు నిత్యావసర సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు అందించాలని కోరారు. గ్రామాల్లో రాజకీయ, ఇతర కారణాలతో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రతి విద్యార్థికి రూ.25 మెస్‌ చార్జీ చెల్లించడంతో పాటు, ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.10 వేల వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ కూసుమంచి మండల కార్యదర్శి మండవ కృష్ణకుమారి, సహాయ కార్యదర్శి గోపి రమణ, గోపి వీరలక్ష్మి, భూక్యా శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.