prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 10:35 am Digital Edition : PRAJA VANI

సుజాత విద్యానికేతన్‌లో జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

సుజాత విద్యానికేతన్‌లో జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

దేశభక్తిని పెంపొందించుకోవాలి.. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి

అమర జవాన్లకు కొవ్వొత్తులతో నివాళులర్పించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

హసన్‌పర్తి, (మన ప్రజావాణి):

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని 66వ డివిజన్ కేంద్రంలో ఉన్న సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ ఆకుతోట శాంతరాం కర్ణ విద్యార్థులకు దేశభక్తి, సరిహద్దు సైనికుల త్యాగాలు, పోలీసుల సేవల ప్రాముఖ్యతను వివరించారు.

ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. 1959 అక్టోబర్ 21న లడఖ్ ప్రాంతంలో చైనా సైన్యం జరిపిన దాడిలో భారత సైనికులు వీరమరణం పొందిన ఘటనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.

ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా మంచు కొండల్లో దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. వారి నిస్వార్థ సేవలు, త్యాగాల వల్లే ప్రజలు దేశంలో ప్రశాంతంగా, సురక్షితంగా జీవించగలుగుతున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకొని అమరవీరుల త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.

దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం వంటి విధుల్లో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించే సందర్భం ఇదని తెలిపారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావాన్ని అలవర్చుకోవాలని, భవిష్యత్తులో దేశానికి సేవ చేసే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తమ పాఠశాల నుంచి కూడా పలువురు విద్యార్థులు సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ వంటి పోలీసు ఉద్యోగాల్లో చేరి సేవలందిస్తున్నారని గుర్తుచేశారు.

కొవ్వొత్తులతో నివాళులు.. రెండు నిమిషాల మౌనం

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించి అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సెల్యూట్ చేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు జూపాక నాగరాజు, ఏ. వెంకట్, వై. అరుణ, సంధ్య, సుచిత్ర, ప్రవళిక, సబిహా, సుధారాణి, భవాని తదితరులు పాల్గొన్నారు.