సిద్దిపేట అభివృద్ధిని జీర్ణించుకోలేక కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శలు
ఆగిపోయిన అభివృద్ధి పనులపై సమాధానం చెప్పాలి
బీఆర్ఎస్వీ రాష్ట్ర యువ నాయకులు మొకిల్ల శ్రీకాంత్ రెడ్డి
సిద్దిపేట, అక్టోబర్ 14 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లాలో పదేళ్లుగా జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర యువ నాయకుడు మొకిల్ల శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో విద్యార్థి నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కృషితో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా, రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.ఉత్సవాలకు రూ.20 కోట్లు ఖర్చు చేశారంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు.
సిద్దిపేట ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని తీసుకురావడంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, అగ్రికల్చర్ కళాశాల, బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడంలో హరీశ్ రావు కీలక పాత్ర పోషించారని అన్నారు. ఐటీ టవర్స్, రైతుల అవసరాల కోసం విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.జిల్లా ఏర్పాటు తర్వాత అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండటంతో ప్రభుత్వ సేవలు సత్వరంగా అందుతున్నాయని పేర్కొన్నారు.నిరుపేద యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యేందుకు గ్రంథాలయం, ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సుమారు 10 శాతం పనులు పూర్తయిన దశలోనే నిలిచిపోయిన వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, వెటర్నరీ కళాశాల రద్దు, ఇతర పెండింగ్ పనులపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కోమటి చెరువు పక్కన ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు చేసిన శిల్పారామం ప్రారంభాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపిస్తూ, దాని అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ జిల్లా నాయకులను డిమాండ్ చేశారు.సిద్దిపేట అభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేయడం మానుకొని, నిలిచిపోయిన అభివృద్ధి పనుల పూర్తికి కృషి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్వీ సిద్దిపేట జిల్లా నాయకుడు పిట్ల రాకేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గ్యార మహేష్, సిద్దిపేట రూరల్ మండల నాయకులు పాపగారి శ్రీకాంత్, దేశ్పాండే విక్రమ్ రావు, పంది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.