సింగరేణి కార్మికుల హామీల అమలుపై INTUC ఆధ్వర్యంలో పాలాభిషేకం
భూపాలపల్లి, అక్టోబర్ 14 మన ప్రజావాణి : సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ SCMLU–INTUC ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా కేటీకే-ఓసీ-III ప్రాజెక్ట్ (U/G) వద్ద బుధవారం పాలాభిషేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
INTUC సెక్రటరీ జనరల్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్, భూపాలపల్లి ఏరియా INTUC బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బేతెల్లి మధుకర్ రెడ్డి ఆదేశాల మేరకు పిట్ సెక్రటరీలు సంగం శ్రీనివాస్, గాజర్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. INTUC రాష్ట్ర నాయకులు, జనరల్ సెక్రటరీ పశునుటి రాజేందర్ మాట్లాడుతూ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు.
సింగరేణి కార్మికులకు 34 శాతం లాభాల వాటా కింద రూ.596.36 కోట్ల పంపిణీకి కృషి చేసిన నాయకులకు అభినందనలు తెలిపారు. కార్మికుల సొంతింటి పథకం అమలు, కారుణ్య నియామకాల కోసం నెలవారీ మెడికల్ బోర్డులు, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు, అలియాస్ నేమ్స్ సమస్య పరిష్కారం, పెండింగ్ కోర్టు, విజిలెన్స్ కేసుల సమీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు.
అలాగే కొత్త బొగ్గు గనుల కేటాయింపు, TS GENCO, TRANSCO బకాయిల చెల్లింపు, గనులకు అవసరమైన సామగ్రి సరఫరా, 33 మంది వైద్యుల నియామకం, అధికారుల PRP విడుదల చేయాలని కోరారు.
వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్ ఎన్. సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సింగరేణి యాజమాన్యం, డాక్టర్ జనక్ ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పశునుటి రాజేందర్, కె. శంకర్, ఎన్. సురేష్‌తో పాటు పలువురు INTUC నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.